ఏది ఏమైనా.. వ్యాక్సినేషన్ మాత్రం కొనసాగాలి : మోదీ

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వీర విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. రెమిడేసివిర్ మందులు, ఆక్సిజన్ లభ్యత ఎలా వుందో అధికారులను అడిగి తెలుస్తున్నారని పీఎంవో ప్రకటించింది. ‘‘దేశ వ్యాప్తంగా ఉన్న కోవిడ్ పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులను అధికారులు వివరంగా ప్రధాని ముందు పెట్టారు. లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న 12 రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని అధికారులు మోదీకి వివరించారు. మిగతా జిల్లాల పరిస్థితిని కూడా మోదీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.’’ అని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది.
వ్యాక్సినేషన్‌పై మోదీ ఆరా….
దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే వ్యాక్సినేషన్‌ను మరింత వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే కొద్ది రోజుల్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి తగిన రోడ్‌మ్యాప్ రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రాలకు 17.7 కోట్ల డోసుల వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరఫరా చేశామని అధికారులు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. 45 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో సుమారు 31 శాతం మంది కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మోదీ ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథాను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉన్నా, వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లూ చేయాలని మోదీ ఆదేశించారు. వ్యాక్సినేషన్ విధుల్లో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధుల్లోకి మళ్లించకూడదని మోదీ సూచించారు.
అత్యంత సమస్యాత్మకంగా ఉన్న జిల్లాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేలా తగు చర్యలు తీసుకోవాలని మోదీ ఆదేధించారు. 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను, ఆక్సిజన్ లేదా ఐసీయూ బెడ్స్ 60 శాతానికి పైగా నిండిన జిల్లాలను సమస్యాత్మక జిల్లాలను పరిగణించాలని, ఈ విషయాన్ని రాష్ట్రాలకు సూచించాలని మోదీ అధికారులను కోరారు.