త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు!

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఈ క్రమంలో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. అంతకంటే ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీటికోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. జూన్ 24 నుంచి జులై 3 వరకు వీటిని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 24-25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉండొచ్చని సమాచారం. ఈ సమయంలో స్పీకర్ పదవి ఎవరికి దక్కొచ్చనే అంశం ఆసక్తిగా మారింది. రాజస్థాన్ కోటా స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు కూడా ప్రచారంలో ఉంది.