కివీస్‌ను ఓడించిన పాక్.. మిగిలే ఉన్న సెమీస్ ఆశలు
వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు కీలకమైన విజయం దక్కింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో న్యూజిల్యాండ్‌ను పాకిస్తాన్ ఓడించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ జట్టు 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (95) అద్భుతంగా ఆడారు. ఇక చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (41), మార్క్ చాప్మన్ (39), డారియల్ మిచెల్ (29), మిచెల్ శాంట్నర్ (26 నాటౌట్) ధాటిగా ఆడారు. దీంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో పాకిస్తాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (9) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే వెటరన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ (126 నాటౌట్), బాబర్ ఆజమ్ (66 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దర్నీ అడ్డుకోవడానికి న్యూజిల్యాండ్ ప్రయత్నిస్తుండగానే వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. కాసేపటికి మళ్లీ మొదలైనా రెండు ఓవర్లు వేయగానే మళ్లీ వర్షం పడింది. ఇక ఆ వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే అప్పటికే 25.3 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 200 పరుగులు చేసిన పాకిస్తాన్.. డీఎల్ఎస్ లక్ష్యం కంటే 21 పరుగులు ఎక్కువే చేసింది. దీంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు. సెంచరీతో చెలరేగిన జమాన్‌కు ‘ప్లేయ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో పాక్ సెమీస్ ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి.













