అమెరికాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు
అమెరికాలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. మన దేశంలో వారు అడుగు పెట్టకుండా నిషేధం విధించింది. ముగ్గురిలో ఒకరు పాకిస్థానీ కాగా, మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులే కావడం గమనార్హం. పాక్‌కు చెందిన రేహన్ సిద్ధిఖీ, భారత సంతతికి చెందిన రాకేశ్ కౌషల్, దర్శన్ మెహతాలు అమెరికాలో మన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ శివసేన ఎంపీ రాహుల్ శెవాలె ఈ ఏడాది ఆరంభంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు లేఖ రాశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన కేంద్ర హోం శాఖ ఆ ముగ్గుర్నీ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. భారత్‌లో వారు కాలు పెట్టకుండా నిషేధం విధించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓ లేఖ ద్వారా శెవాలెకు తెలియజేశారు.













