సుప్రీంకోర్టులో కాంగ్రెస్కు ఊరట.. ఐటీ శాఖకు షాక్
వరుస ఐటీ నోటీసులతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ భారీ ఊరట కల్పించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏ పార్టీని ఇబ్బందులకు గురిచేయాలనుకోవట్లేదని, అందుకే రూ.3500 కోట్ల పన్ను చెల్లింపు నోటీసులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోబోమని అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కూడా ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. కాగా.. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్కు ఐటీ శాఖ వరుస నోటీసులు పంపిన విషయం తెలిసిందే. రూ.3,500 కోట్ల రూపాయల ఆదాయాలకు సంబంధించి కాంగ్రెస్ ఆదాయపు పన్ను చెల్లించలేదని చెబుతూ ఆ పార్టీకి సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి ఆయా ఖాతాల నుంచి దాదాపు రూ.135 కోట్ల రూపాయలు పెనాల్టీగా వసూలు చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే విమర్శలు చేసింది. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు ఐటీ శాఖ తీసుకుంటున్న ఈ చర్యలు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే చేయిస్తోందని, ఎన్నికల్లో ప్రతిపక్షాలకు బలహీన పరిచి దెబ్బతీయాలనేదే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ ఆరోపించింది.
సుప్రీంలో కాంగ్రెస్కు ఊరట:
ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ ముందుగా హైకోర్టును ఆశ్రయించింది. తమ బ్యాంకు ఖాతాలను రిలీజ్ చేయాలని కోరింది. కానీ హైకోర్టు అందుకు అంగీకరించకుండా ఐటీ శాఖ తీరును సమర్థించింది. దీంతో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. అయితే హస్తం పార్టీ మాత్రం పట్టువదలకుండా సుప్రీం కోర్టు తలుపు తట్టింది. కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఏ పార్టీని ఆదాయపన్ను శాఖ నుంచి బకాయిల విషయంలో ఇబ్బంది పెట్టవద్దని ఆదేశించారు. అనంతరం ఈ పిటిషన్పై తదుపరి విచారణను జూలై 24కి వాయిదా వేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఐటీ శాఖ కూడా ఎన్నికలు ముగిసే వరకు పన్ను చెల్లింపు నోటీసులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీపై ఎలాంటిచర్యలు తీసుకోబోమని పేర్కొంది. దీంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ రిలీఫ్ లభించింది.













