తొమ్మిదేళ్ల బాలుడు తన కళతో… ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ బాలుడు తన కళతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందాడు. 55 సెకన్లలోనే 15 స్తోత్రాలను పారాయణం చేసి వావ్ అనుకునేలా చేశాడు. ఢిల్లీ పీతంపూరలోని భారత పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ వివాన్ ప్రతిరోజు ఉదయాన్నే తన నానమ్మ శివ తాండవ స్తోత్రాలు పారాయణం చేయడాన్ని గమనించి వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు. నానమ్మ స్తోత్రాలు చదువుతున్నప్పుడు వాటిని గుర్తుపెట్టుకుని తిరిగి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. క్లిష్టమైన శ్లోక స్తోత్రాలను కంఠస్థం చేయడంతో పాటు లయబద్ధంగా పాడటం తెలుసుకున్నాడు. కఠినమైన శివస్తోత్రాలు వినాన్ అవలీలగా పాటడం చూసి ఆశ్చర్యపోయిన అతడి తాతయ్య.. అప్పటి నుంచి వివాన్కు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ స్తోత్ర పారాయణానికి సంబంధించిన పలు విషయాలు చెప్పాడు.
వివాన్ కఠినమైన శివ తాండవ స్తోత్రాలను కేవలం 55 సెకన్లలో పారాయణం చేసి రికార్డు సృష్టించాడు. ఈ మేరకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డస్ వారు ఈ రికార్డు ప్రదానం చేయడంతో వివాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో క్లిష్టమైన స్తోత్రాల పారాయణం చేయడం అరుదైన విషయమని, అది ఈశ్వరానుగ్రహమని వివాన్ తాతయ్య తెలిపారు. వివాన్ కృషి, పట్టుదలతో ఈ ఫీట్ సాధించాడని, తనకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.













