అమెరికాలో దాడి.. పంజాబ్, హర్యానాలో ఎన్ఐఏ సోదాలు
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత దౌత్య కార్యాలయంపై దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పంజాబ్, హర్యానాల్లోని 14 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ మేరకు ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 19, జులై 2న విదేశాల్లోని భారత కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసుల విచారణలో భాగంగా పంజాబ్లోని మోగా, జలంధర్, లూథియానా, గురుదాస్ పుర్, మొహాలి, పాటియాలాతో పాటు హర్యానాలోని కురుక్షేత్ర, యమ నానగర్లో సోదాలు చేపట్టినట్లు తెలిపింది. ఈ సోదాల్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి వెనుకున్న నిందితుల వివరాలతో పాటు, ముఖ్యమైన డిజిటల్ డేటా, కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడిరచింది. దాడి వెనకున్న నిందితులను గుర్తించి, విచారించడంతో పాటు, విదేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి గట్టి హెచ్చరికలు పంపాలనే ఉద్దేశంతో ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.













