జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి స్వర్ణ పతకం లభించింది. ఫురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో శనివారం పోటీపడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని గెలుపొందాడు. వంద ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారతీయ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రోలో ప్రత్యర్థులెవరూ నీరజ్ చోప్రా దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఫస్ట్ ప్రయత్నంలోనే 87.03 మీటర్లు జావెలిన్‌ని విసిరిన నీరజ్ చోప్రా.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 87.58మీ, మూడో ప్రయత్నంలో 76.93మీ విసిరాడు. నాలుగో ప్రయత్నంలోనూ 80మీ దగ్గరగా జావెలిన్‌ని నీరజ్ చోప్రా విసిరాడు. కానీ అది ఫాల్ అయ్యింది. ఐదో ప్రయత్నంలోనూ అలానే జరిగింది. ఇక చివరి ప్రయత్నంలో మాత్రం 84.24 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. పసిడి పతక సంబరాలు మొదలెట్టాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా.. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్‌లో భారత్‌కి పసిడి పతకం దక్కడం ఇదే తొలిసారి.













