జి-20 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ
ఈ నెల 30న ఇటలీలోని రోమ్‌లో ప్రారంభం కానున్న జి-20 దేశాల అధినేతల 16వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రధాని ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీదాకా ఇటలీతో పాటు యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పర్యటిస్తారని తెలిసింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)`26 ప్రపంచ దేశాల అధినేతల సదస్సులోనూ ఆయన పాల్గొంటారని పేర్కొంది. జి-20 కూటమికి ప్రస్తుతం ఇటలీ నాయకత్వం వహిస్తోంది. ఈ నెల 30, 31న రోమ్‌లో రెండో రోజులపాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఆ దేశమే ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గానిస్తాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు మానవాళికి విసురుతున్న సవాళ్లు, కరోనా వైరస్ వంటి కీలక అంశాలపై జి-20 సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. 1999 నుంచి జి`20 సదస్సును ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. కాప్ 26 సదస్సు ఈ నెల 31 నుంచి నవంబర్ 12 దాకా యూకేలోని గ్లాస్గోలో జరగనుంది.













