జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్… ఉచితంగానే ఇస్తామని మోదీ ప్రకటన

వ్యాక్సినేషన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. ఈ బాధ్యత కేంద్రమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇకపై కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని, కేంద్రానిదే సంపూర్ణ బాధ్యత అని ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు 25 శాతం డోసులు మాత్రం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రులు 150 రూపాయలు మాత్రమే సర్వీస్ ఛార్జ్ కింద తీసుకోవాలని నిబంధనలు విధించారు. వీటి విషయమై త్వరలోనే తగు మార్గదర్శకాలను జారీ చేస్తామని మోదీ ప్రకటించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదని, కేంద్రమే మొత్తం చూసుకుంటుందని తేల్చి చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అనేక మార్లు మాట్లాడానని, వ్యాక్సిన్ కొరతపై రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయని మోదీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఉందని, దీనిపై ఏం చేయాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకుంటామని పేర్కొన్నారు.