కమలం గూటికి ‘మెట్రోమ్యాన్’
ఎన్నికలు జరిగే కొద్ది నెలల ముందు కేరళలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ వైపు ‘మేధావి వర్గం’ ఆకర్షితమైంది. మెట్రో మ్యాన్‌గా ప్రసిద్ధి గాంచిన ఇ. శ్రీధరన్ బీజేపీలో చేరడానికి సిద్ధమైపోయారు. బీజేపీ నిర్వహించే ‘విజయ యాత్ర’ వేదికగా ఆయన బీజేపీలో చేరనున్నారని కేరళ బీజేపీ ప్రకటించింది. ‘‘నేను బీజేపీలో చేరడానికి సిద్ధపడిపోయా. అధికారికంగా మాత్రమే చేరాల్సి ఉంది.’’ అని శ్రీధరన్ ప్రకటించారు. ‘‘గత 10 సంవత్సరాలుగా కేరళలో ఉంటున్నా. చాలా ప్రభుత్వాలను చూశా. కానీ ప్రజలకు ఏది అవసరమో అది చేయడం లేదు. 20 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా కేరళకు రాలేదు. నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి బీజేపీలో చేరుతున్నా. నా అనుభవాన్ని పునాదులుగా చేసుకొని పనిచేస్తూ పోతాను.’’ అని శ్రీధరన్ ప్రకటించారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు రెండూ వచ్చాయని, అయినా వచ్చిన మార్పేమీ లేదని విమర్శించారు. విదేశీ శక్తుల ప్రోద్బలంతో దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, విమర్శించాలి కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
గతంలోనే సిగ్నల్స్ ఇచ్చిన శ్రీధరన్
బీజేపీలో చేరడానికి తనకెలాంటి ఇబ్బందీ లేదని కొన్ని రోజుల క్రిందటే శ్రీధరన్ సిగ్నల్స్ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని, బీజేపీ ఒప్పుకుంటే ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగానే ఉన్నానని కొన్ని రోజుల క్రితం కుండబద్దలు కొట్టారు. బీజేపీపై తనకు పూర్తి నమ్మకం ఉందని, లవ్‌జిహాద్‌తో సహా మరికొన్ని విషయాల్లో బీజేపీ తీసుకున్న వైఖరి ఎంతో సముచితంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఈ కారణంగానే తాను బీజేపీలో చేరుతానని ప్రకటించారు.
ఆనందంగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం : సురేంద్రన్
తాము మెట్రో శ్రీధరన్‌ను ఆనందంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ ప్రకటించారు. పూర్తి సమగ్రతను, విశ్వాసాన్ని కలిగి వున్న వ్యక్తి అని కొనియాడారు. అలాంటి నిబద్ధత గల వ్యక్తులు బీజేపీలో చేరితే మోదీ చేస్తోన్న అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కేరళలో ఆయనతో కలిసే ముందుకు సాగుతామని సురేంద్రన్ ప్రకటించారు.
తలలో నాలుకలా మెట్రో శ్రీధరన్
మెట్రో అంటే శ్రీధరన్… శ్రీధరన్ అంటే మెట్రో. అంతలా అందరికీ తలలో నాలుకలా మారిన వారు శ్రీధరన్. ఢిల్లీ మెట్రోను వేగంగా, అత్యంత సమర్థవంతంగా పట్టాలెక్కించి అందరితో ప్రశంసలందుకున్నారు. మొదట్లో ఈయన కోజికోడ్ లో ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాంబే పోర్ట్ ట్రస్ట్‌లో ఓ సంవత్సరం పాటు అప్రెంటిస్‌గా చేశారు. ఆ తర్వాత ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ లో చేరారు.
1964 లో డిసెంబర్లో తుఫాను కారణంగా రామేశ్వరాన్ని, తమిళనాడు ప్రధాన భూభాగాన్ని అనుసంధానించే పంబన్ వంతెన కొట్టుకుపోయింది. ఈ వంతెన మరమ్మతులు చేయడానికి ఆరు నెలల కాలం నిర్దేశించారు. అయితే ఆ యజమాని తప్పుకోవడంతో శ్రీధరన్ ఆ బాధ్యతలు మోశారు. కేవలం 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరింపజేశారు.
ఢిల్లీ మెట్రోతో పేరు ప్రఖ్యాతులు
ఢిల్లీ మెట్రోతోనే ఈయనకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆనాటి ఢిల్లీ సీఎ సాహెబ్ సింగ్ వర్మ ఈయనను ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ఈ ప్రాజెక్టును 1997 మధ్య ఇచ్చిన గడువు కంటే ముందే పూర్తి చేసి మనన్నలు అందుకున్నారు. ఈ ప్రాజెక్టు విజయం కారణంగా అతన్ని అందరూ ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా ప్రకటించారు.













