మేమేమీ అన్నాడీఎంకే కార్యకర్తలం కాదు.. డీఎంకే కార్యకర్తలం : స్టాలిన్
డీఎంకే అధినేత స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇళ్లపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఉదయం నుంచి తనిఖీలను నిర్వహించారు. నాలుగు ప్రదేశాల్లో ఈ దాడులను నిర్వహించారు. ఇటీవలే పలువురు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ నేతలపై ఐటీ దాడులు జరిగాయి. ఇవి మరిచిపోక మునుపే ఈ దాడులు జరగడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. పైగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం. ఈ నేపథ్యంలోనే ఐటీ రైడ్స్ జరుగుతుండటంతో రాజకీయంగా విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ ఐటీ దాడులపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.
నా పేరు స్టాలిన్… కరుణానిధి కుమారుడిని…
తన అల్లుడి ఇళ్లపై ఐటీ దాడులు జరగడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దాడులతో తమను భయపెట్టించలేరని స్పష్టం చేశారు. తాము అన్నాడీఎంకే కార్యకర్తలము కామని, డీఎంకే కార్యకర్తలమని, దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘నా పేరు స్టాలిన్. కరుణానిధి కుమారుడిని. మీసాను, ఎమర్జెన్సీని కూడా ఎదుర్కొన్నాను. ఐటీ దాడులకు భయపడను. బెదరను. అదరను.’’ అంటూ స్టాలిన్ ఘాటుగానే స్పందించారు.
విరుచుకుపడ్డ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
స్టాలిన్ అల్లుడి ఇంటిపై ఐటీ రైడ్స్ చేసిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా స్పందించారు. రాజకీయ ప్రత్యర్థులను కేంద్రం వేటాడుతోందని మండిపడ్డారు. ఇందుకు ఈ ఉదంతమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, వీటిని అడ్డుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చొరవ తీసుకోవాలని మెహబూబా ఆకాంక్షించారు.













