తృణమూల్ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ బెనర్జీ… ప్రమోషన్ కల్పించిన సీఎం మమత

సీఎం మమతా బెనర్జీ తన మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ప్రమోషన్ కల్పించారు. పార్టీలో అత్యంత కీలక పదవి అయిన ప్రధాన కార్యదర్శి పదవిని అభిషేక్ బెనర్జీకి సీఎం మమత అప్పజెప్పారు. శనివారం పార్టీ ముఖ్య నేతల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం మమత కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే అభిషేక్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సీఎం మమత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ అభిషేక్ బెనర్జీ పార్టీ యువజన విభాగాన్ని చూసుకునేవారు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లోకి రావడంతో యువజన విభాగం అధ్యక్షునిగా నటుడు సాయోని ఘోష్‌ను నియమిస్తూ సీఎం మమత నిర్ణయం తీసుకున్నారు. ఇక మహిళా విభాగాన్ని ఎంపీ కకోలీ ఘోష్‌కు అప్పగించారు.
ఒకే వ్యక్తి- ఒకే పదవి : పార్థా ఛటర్జీ
ఎంపీ అభిషేక్ బెనర్జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ఆ పార్టీ సీనియర్ నేత పార్థా ఛటర్జీ స్పందించారు. ‘‘అభిషేక్ బెనర్జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ బాధ్యతల్లోకి రావడంతో ఆయనకు ప్రమోషన్ దొరికినట్లే. దీంతో ఆయన్ను యువజన విభాగం నుంచి తప్పిస్తున్నాం. ఒకే వ్యక్తి- ఒకే పదవి అన్న విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాం. అందుకే అభిషేక్‌ను యువజన బాధ్యతల నుంచి తొలగించి, ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చాం’’ అని పార్థా ఛటర్జీ పేర్కొన్నారు.
తెర వెనక ఉంటూ, అధికారాన్ని అందించిన అభిషేక్…
అభిషేక్ బెనర్జీ. తృణమూల్ ఎంపీ. అంతేకాకుండా సీఎం మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు. పార్టీలో తెరవెనుకే ఉంటూ వ్యవహారాలను చక్కబెడతారని పేరుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెర వెనక ఉంటూ పార్టీని నడిపించారు. సీఎం మమత ప్రచార బాధ్యతలు చూసుకుంటే, పార్టీ టిక్కెట్ వ్యవహారాలు, క్షేత్ర స్థాయిలో అధ్యయనం, బుజ్జగింపులు ఇలాంటి కీలక బాధ్యతలు అభిషేక్ భుజానికెత్తుకున్నారు. ఒకానొక దశలో అభిషేక్ బెనర్జీపై సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా సీఎం మమతా బెనర్జీ కిమ్మనలేదు. ఎవరెన్ని విమర్శలు చేసినా, అభిషేక్‌కు కల్పించాల్సిన ప్రాధాన్యాన్ని మమతా బెనర్జీ కల్పించారు. పార్టీ ఘన విజయం సాధించడంలో అభిషేక్ బెనర్జీ పాత్ర కూడా ఉంది. దీనికి ప్రతిఫలంగానే సీఎం మమత అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టినట్లు పార్టీ నేతలు అంటున్నారు.
ఇక పార్టీ వ్యవహారాలు అభిషేకే చూసుకుంటారా?
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని సీఎం మమత ఎంపీ అభిషేక్‌కు కట్టబెట్టారు. దీంతో పార్టీలో మార్పులు తప్పవని అందరూ భావిస్తున్నారు. సీఎం మమత పాలనా వ్యవహారాలు చూసుకుంటే, పార్టీ పనులు, బాధ్యతలను ఇకపై అభిషేక్ బెనర్జీ చూసుకుంటారని కొందరు నేతలు పేర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కొంచెం సమయం మాత్రమే మిగిలి ఉంది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, సీఎం మమతకు ఎప్పుడూ ఏదో ఒకరకమైన ఘర్షణ తలెత్తుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం మమత పూర్తిగా పాలనా వ్యవహారాలు చూసుకుంటారని, అభిషేక్ బెనర్జీ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని తృణమూల్‌లోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.