ఇది 21వ శతాబ్దపు అతిపెద్ద ఘటన : మమత
ఒడిశాలో జరిగిన భారీ రైలు ప్రమాదం 21వ శతాబ్దపు అతిపెద్ద ఘటన అని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రైల్వే శాఖ తనకు బిడ్డతో సమానమని, దాని క్షేమం కోసం సూచనలు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని వ్యాఖ్యానించారు. నేను మూడుసార్లు రైల్వే మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి నేను చూసిన వాటిలో 21వ శతాబ్దపు అతిపెద్ద ఘటన ఇది. ఇలాంటి కేసుల్ని రైల్వే సేఫ్టీ కమిషన్‌కు అప్పగించాలి. వారు విచారణ జరిపి, నివేదిక ఇస్తారు. అలాగే నాకు తెలిసినంత వరకు కోరమాండ్లో యాంటీ కొలిజన్ డివైస్ లేదు. అదే ఉండి ఉంటే ఈ స్థాయి ప్రమాదం జరిగేది కాదు.
చనిపోయిన వారిని వెనక్కి తీసుకురాలేం. కానీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా తక్షణ చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మనముందున్న కర్తవ్యం. రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే బెంగాల్‌కు చెందిన వారికి ప్రభుత్వం తరపు నుంచి 5 లక్షలు అందిస్తామన్నారు. సహాయక, పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యే వరకు రైల్వే శాఖ, ఒడిశా ప్రభుత్వానికి సహకరిస్తాం. ప్రస్తుత రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు. ఆ శాఖ నాకు బిడ్డతో సమానం. దానిలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు సూచనలు ఇవ్వడానికి నేను సిద్ధం అని అన్నారు.













