ఆయన అవసరం దేశానికి లేదు : మమతా బెనర్జీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ ప్రయోజనాల కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసి బహిరంగ ర్యాలీలో పాల్గొన్న దీదీ మోదీపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తనను తాను మరో దేవుడిగా భావిస్తున్నారు. కానీ, దేవుళ్లు రాజకీయాలు చేయరు. అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయరు. నిజంగా ఆయన తనను దేవుడిగా భావిస్తే నేనొక్క విన్నపం చేసుకుంటున్నా. మోదీజీ మీకు ఒక దేవాలయాన్ని నిర్మిస్తా. ప్రసాదంగా డోక్లా ( గుజరాత్‌లో ప్రత్యేక వంటకం) పెడతా. నిత్యం పూజలు చేస్తా. దయచేసి మీరు ఆలయంలో కూర్చోండి. దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోండి అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ఎంతోమంది ప్రధానులతో కలిసి పనిచేశా. అందులో అటల్ బిహార్ వాజ్‌పేయ్ కూడా ఉన్నారు. ఆయన అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కానీ, మోదీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. ఆయన అవసరం దేశానికి లేదు అని మమతా వ్యాఖ్యానించారు.