వారిని వెంటనే భారత్ నుంచి పంపేయండి
దేశ రాజధాని ఢిల్లీలో రోహింగ్యాలకు పునరావాసంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్పీ) తప్పుపట్టింది. వారిని వెంటనే దేశం నుంచి పంపేయాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాగా, రోహింగ్యాలను ఔటర్ ఢిల్లీలోని బక్కర్ వాలాలోని అపార్ట్మెంట్లకు తరలిస్తామని గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. వారికి ప్రాథమిక సౌకర్యాలు, పోలీసు రక్షణ కల్పిస్తామని తెలిపారు. తిక్రీ సరిహద్దు సమీపంలోని బక్కర్వాలా ప్రాంతంలో ఇడబ్ల్యఎస్ ప్లాట్లను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎస్డీఎంసీ) నిర్మించిందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్పీ) వ్యతిరేకించింది. ఇప్పటికే పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ఢిల్లీలోని మజ్ను-కా-తిలా ప్రాంతంలో అధ్వాన్నమైన పరిస్థితులలో జీవిస్తున్నారని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఆరోపించారు. రోహింగ్యాలకు గృహ వసతి కల్పించే బదులు వారిని భారత్ నుంచి వెనక్కి పంపే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.













