మార్చి 9 తర్వాత లోక్‌సభ షెడ్యూల్?
లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను మార్చి 9వ తేదీ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ఈసారి కూడా 2019లో మాదిరిగానే ఉంటుందని చెబుతున్నారు. 2019లో మార్చి 10వ తేదీన ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించగా ఏప్రిల్ 11, మే 19 మధ్యన ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. తాజాగా, ఎన్నికల సన్నద్ధతను తెలుసుకునేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. లోక్‌సభతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీకు సైతం ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. మార్చి 8, 9 తేదీల్లో ఎన్నికల అధికారులు జమ్మూకశ్మీర్ యంత్రాంగం తో చర్చించి, అక్కడ భద్రతా సిబ్బంది అందుబాటుపై సమీక్ష చేపట్టనున్నారు. మరో రెండు మూడు రోజుల తర్వాత మరోమారు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయనున్నారని సమాచారం.













