శబరిమలలో మద్యం, డ్రగ్స్, పొగాకుపై నిషేధం.. కఠిన చర్యలు తప్పవన్న ప్రభుత్వం
అయ్యప్ప భక్తులు కేరళలోని శబరిమల క్షేత్రాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో అందరికీ తెలిసిందే. ఏటా ఈ క్షేత్రంలో రెండు నెలలపాటు ‘మండలం మకరవిళక్కు’ అనే పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఈ పండుగ కోసం శబరిమల ముస్తాబవుతోంది. మరో మూడు రోజుల్లో ఈ పండుగ మొదలవుతుంది. ఈ క్రమంలో ఆలయ పరిసరాలను నవంబర్ 14 నుంచి వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ వరకు ‘లిక్కర్, డ్రగ్స్ ఫ్రీ జోన్’గా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని శబరిమలలోని వ్యాపారులు, భక్తులు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచించారు. అలాగే మందు, డ్రగ్స్, పొగాకుపై విధించిన ఆంక్షలను ఎవరూ ఉల్లంఘించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ, అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.













