ఢిల్లీ చేరిన కమల్ నాథ్.. ఇందిర మూడో కుమారుడు కాంగ్రెస్ వీడతారా?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆ పార్టీతో తనకున్న 45 ఏళ్ల బంధాన్ని తెంచేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా బీజేపీలో చేరనున్నారనంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుతం బీజేపీ మధ్యప్రదేశ్ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా చేసిన ఒక పోస్టుతోనే ఈ వార్తలు మొదలయ్యాయి. కమల్ నాథ్, ఆయన కుమారుడు నకుల్ నాథ్‌తో ఫొటో దిగిన సలూజా.. ‘జై శ్రీరామ్’ అనే క్యాప్షన్‌తో ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఈ వార్తలన్నీ బూటకమేనని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ మాట్లాడుతూ.. కమల్ నాథ్ 45 ఏళ్లుగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారని గుర్తుచేశాడు. ‘విజయాలు, ఓటములు అన్నింట్లో కమల్ నాథ్ ఈ పార్టీతో కలిసి నడిచారు. ఆయన తొలిసారి ఎన్నికల్లో నిలబడినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మాట్లాడుతూ కమల్ నా మూడో కుమారుడు అన్నారు. అలాంటి నేత కాంగ్రెస్ వీడతారని ఎలా అంటున్నారు? ఈ వార్తలన్నీ పచ్చి అబద్ధం’ అని పట్వారీ స్పష్టం చేశారు. అయితే ఇలాంటి వార్తలు వినిపిస్తున్న సమయంలో కమల్ నాథ్ ఢిల్లీ ప్రయాణమయ్యారు. దీంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. కమల్ నాథ్ కనుక కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మధ్యప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా గట్టి ఎదురు దెబ్బ పడినట్లేనని విశ్లేషకుల మాట.













