సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా.. జస్టిస్ భూయాన్, జస్టిస్ ఎస్.వి.భట్ ప్రమాణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్లు ప్రమాణ స్వీకారం చేశారు. కోర్టు పని వేళల ప్రారంభానికి ముందు సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వీరిద్దరిచేత ప్రమాణం చేయించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు సీజేగా సేవలందిస్తున్న జస్టిస్ సరస వెంకటనారాయణ భట్ (ఎస్.వి.భట్)లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం ఈ నెల 5న సిపార్సు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఈ నెల 12న రాష్ట్రపతి ద్రౌపదీమురుమ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన నియామక ఉత్తర్వులకు అనుగుణంగా ప్రధాన న్యాయమూర్తి వారిద్దరితో ప్రమాణం చేయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది. ఇంకా 2 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులంతా పాల్గొన్నారు.













