సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్లపాటు ( నవంబర్ 10, 2024) సీజేగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 44 ఏళ్ల క్రితం జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. ఈ ఘట్టం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి చోటు చేసుకుంది.
సుప్రీంకోర్టు కంటే ముందు అలహాబాద్, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పని చేశారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. 1998`2000 మధ్య అదనపు సోలిసిటర్ జనరల్‌గానూ జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు నిర్వర్తించారు. సీబీఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, కిరణ్‌రిజిజు తదితరులు హాజరయ్యారు.













