అయోధ్య వేడుకకు ఆ ఐదుగురికి ఆహ్వానం
శతాబ్దాల వివాదానికి ముగింపు పలుకుతూ, అయోధ్యలో మందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేసిన సుప్రీం న్యాయమూర్తులకు 22వ తేదీన జరిగే ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఆహ్వానం లభించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్డే, ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు నాటి బెంచ్‌లో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లకు రామజన్మ భూమి ట్రస్టు నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. 2009 నవంబర్ 9న ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు 16వ శతాబ్దంలో నిర్మించిన మసీదు కింద మందిరం ఉందన్న ఆర్కియాలజీ నివేదిక ఆధారంగా సంక్లిష్ట విధానాన్ని పరిష్కరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద స్థలం రామ్‌లల్లాకు చెందుతుందన్న ధర్మాసనం, మసీదు కోసం పట్టణంలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆనాటి చారిత్రక తీర్పు ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వేడుక ఆహ్వానితుల జాబితాలో రామ్‌లల్లా తరపున కేసు వాదించిన న్యాయవాది పరాశరన్ సహా 50 మంది న్యాయ నిపుణులు కూడా ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ కేకే వేణుగోపాల్ తదితర ప్రముఖులున్నారు.













