భారత్ చేరిన జపాన్ ప్రధాని కిషిదా.. మోదీతో కీలక భేటీ
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా భారతదేశంలో అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు ఆయన భారత్లో పర్యటిస్తారు. ఈ క్రమంలోనే ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన జపాన్ ప్రధానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆహ్వానం పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే భేటీలో కీలకమైన ద్వైపాక్షిక సంబంధాలపై కిషిద చర్చిస్తారని సమాచారం. అలాగే ప్రస్తుత ప్రపంచ సమస్యలు, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఈ ఇద్దరు ప్రధానులు మాట్లాడుకుంటారట. ప్రస్తుతం జీ7 దేశాలకు జపాన్ అధక్ష్యత వహిస్తుండగా, జీ20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ7, జీ20 దేశాల మధ్య సహకారంపై కూడా కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లు, భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యంపై ప్రధాని మోదీతో చర్చిస్తానని జపాన్ ప్రధాని తన ట్విట్టర్లో ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.













