జమ్ము కాశ్మీర్ రండి…ప్రత్యేక ప్యాకేజీలు
దేశంలోని పర్యాటక ప్రాంతంలో ప్రముఖమైన జమ్మూ కశ్మీర్ లో పర్యటించేందుకు పర్యాటకులు రావాలని, పర్యాటకుల కోసం ప్యాకేజీలను పునరుద్ధరించినట్లు జమ్మూ కశ్మీర్ పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అన్షునల్ హఖ్ చిస్తి తెలిపారు. పర్యాటక రంగంపై ఆధారపడిన జమ్మూ కశ్మీర్ లో 95 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, కోవిడ్ అనంతరం పునరుద్ధరించిన ప్యాకేజీల్లో ఇప్పటి వరకు పర్యాటకులు సందర్శించలేకపోయిన అనేక ప్రాంతాలు ఉన్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజౌరి, జమ్మూ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సీఈవో వివేక్ పూరీతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ, రానున్న మూడు నెలల్లో 75 వేడుకలను జమ్మూ కశ్మీర్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పర్యాటకులకు భద్రత, రక్షణ ఉంటుందని, భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా పర్యటించవచ్చని చెప్పారు. తెలుగు సినిమా షూటింగ్ల కోసం జమ్మూ, కశ్మీర్, లేహ్, లద్దాక్ తదితర ప్రాంతాల్లో పర్యాటక స్థలాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తగ్గింపు ధరలతో ప్యాకేజీలను అందజేస్తోందన్నారు.













