కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి.. మోదీ ఓడిపోయాడు: జైరాం రమేశ్
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయంపై ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓడిపోయారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైన తర్వాత ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ఫలితాలపై తన అభిప్రాయం వెల్లడించారు. కర్ణాటకలో తమ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టి పెట్టిందని, కానీ ప్రధాని మోదీ మాత్రం విభజనవాదాన్ని ప్రచారం చేశారని విమర్శించారు. ప్రజల జీవనోపాధి, ఆహార భద్రత, ధరల పెరుగుదల, రైతుల కష్టాలు, విద్యుత్ సరఫరా, నిరుద్యోగం, ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పోరాడిందని తెలిపారు. ప్రజల కష్టాలపై పోరాడిన కాంగ్రెస్కు ఓటర్లు పట్టం కట్టారని చెప్పిన జైరాం రమేశ్.. ప్రధాని మోదీ మాత్రం ఈ ఎన్నికలను రిఫరెండంగా చెప్పుకొచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పనితీరును చూసి ఎన్నికల్లో ఓటేయాలన్న బీజేపీ నేతల విజ్ఞప్తిని గుర్తుచేసిన ఆయన.. ప్రజాతీర్పుతో మోదీ ఫెయిలైనట్లు తేలిందన్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ గెలవగా ప్రధాని మోదీ ఘోరంగా ఓడిపోయారని తెలిపారు.













