అక్కడికి వెళ్లి తిరిగి రావడంపై.. పరిశోధనలు చేయాలి : ఇస్రో చీఫ్

అందని ద్రాక్షగా ఉన్న చందమామ దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా ల్యాండర్‌ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ మరోసారి స్పందించారు. భవిష్యత్తుల్లోనూ మరిన్ని జూబిల్లి యాత్రలు చేపడతామని చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రయాన్-3 విజయవంతమైంది. దాన్నుంచి డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నాం. ఇక జాబిల్లిపై భారతీయుడు అడుగుపెట్టేంతవరకు చంద్రయాన్ సిరీస్‌లను కొనసాగించాలని అనుకుంటున్నాం. అంతకంటే ముందు ఇంకా చాలా సాంకేతికతలపై పట్టు సాధించాలి. అక్కడికి వెళ్లి తిరిగి రావడంపై పరిశోధనలు చేయాలి. తదుపరి మిషన్‌లో దీన్ని ప్రయత్నిస్తాం అని వెల్లడించారు.