పుల్వామాలో హస్తం ఉందనడానికి పాక్ మాటలే ప్రమాణం : వీకే సింగ్
న్యూఢిల్లీ : దాయాది పాకిస్తాన్ ను బ్లాక్లిస్ట్ లో పెట్టాలని కేంద్ర మంత్రి వీకే సింగ్ డిమాండ్ చేశారు. ఇందుకు గాను ఎఫ్ఏటీఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) ప్రయత్నించాలని ఆయన సూచించారు. పుల్వామా దాడి వెనుక తమ హస్తమే ఉందని సాక్షాత్తూ పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ప్రకటించారని, పాక్ ప్రమేయం ఉందనడానికి ఆయన వ్యాఖ్యలే ప్రమాణమని వీకే సింగ్ అన్నారు. ‘‘పుల్వామా ఉగ్రదాడి గురించి సత్యాన్ని అంగీకరించినందుకు ఫవద్ చౌదరికి ధన్యవాదాలు చెబుతున్నాను. తాము మొదటి నుంచీ ఇదే విషయాన్ని చెబుతున్నా. ఈ విషయంలో ఆధారాలన్నీ పాకిస్తాన్ వైపే వేలెత్తి చూపుతున్నాయి. పాక్ ఆశ్రయమిచ్చిన ఉగ్రవాదులపై మన దేశం చర్యలు తీసుకుంది. మంత్రి ఫవద్ చౌదరి చేసిన వ్యాఖ్యలను మేం పరిగణనలోకి తీసుకుంటాం. పాకిస్తాన్ ను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్లిస్ట్ లో పెట్టించాల్సిందే.’’ అని వీకే సింగ్ పేర్కొన్నారు.













