శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. 302 పరుగుల తేడాతో ఘన విజయం
శ్రీలంకపై భారత జట్టు మరోసారి ప్రతాపం చూపించింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో ఏకంగా 302 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. శుభ్మన్ గిల్ (92), విరాట్ కోహ్లీ (88), శ్రేయాస్ అయ్యర్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు చేసింది. లంక యువ పేసర్ దిల్షాన్ మధుశంక ఐదు వికెట్లతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంకకు భారత పేసర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన బుమ్రా.. భారత్కు అదిరే బ్రేక్ ఇచ్చాడు. రెండో ఓవర్ తొలి బంతికే సిరాజ్ కూడా వికెట్ తీసుకున్నాడు. మొత్తం ఆ ఓవర్లో రెండు వికెట్లతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత షమీ వచ్చి.. దాదాపుగా తను వేసిన ప్రతి ఓవర్లో వికెట్ తీసుకున్నాడు. కేవలం 18 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో భారత్ తరఫున వన్డే వరల్డ్ కప్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇలా భారత పేసర్లు చెలరేగడంతో శ్రీలంక జట్టు 55 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 302 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. బంతితో చెలరేగిన మహమ్మద్ షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













