సఫారీలను తిప్పేసిన జడ్డూ.. ఘోరంగా ఓడిన సౌతాఫ్రికా
టేబుల్ టాపర్ల పోరులో భారత జట్టు విజేతగా నిలిచింది. సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు రోహిత్ శర్మ (40) అదిరే ఆరంభం అందించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (101 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (77) కీలకమైన ఇన్నింగ్సులు ఆడారు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (24), రవీంద్ర జడేజా (29 నాటౌట్) మెరుపులతో టీమిండియా 326/5 పరుగుల భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఈ స్కోరును ఛేజ్ చేయడం సౌతాఫ్రికా వల్ల కాలేదు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగడంతో సపారీ బ్యాటర్లు తేలిపోయారు. ఆ టీంలో మార్కో యాన్సెన్ (14) టాప్ స్కోరర్ అంటేనే వాళ్ల బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో తెలుసుకోవచ్చు. జడ్డూతోపాటు కుల్దీప్, షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో ఏకంగా 243 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. టేబుల్ టాపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోరు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













