ఆ పథకాన్ని వెంటనే అమలు చేయండి… రాష్ట్రాలకు సుప్రీం డెడ్ లైన్

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు (వన్ నేషన్, వన్ రేషన్) పథకాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. మహమ్మారి ముగిసేవరకు వలసదారులకు ఆహారం అందించడానికి రాష్ట్రాలు కమ్యూనిటీ కిచెన్లను నడపాలి అని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు అదనపు ఆహార ధాన్యాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వలస కార్మికుల నమోదు కోసం, జూలై 31లోగా పోర్టల్‍ని ఏర్పాటు చేయాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షా న్యాయమూర్తుల ధర్మాసనం అసంఘటిత, వలస కార్మికుల వివరాలు నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జూలై 31లోపు పోర్టల్‍ని అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకురావాలి. జూలై 31 లోపు ఈ పక్రియను ప్రారంభించాలి అని తెలిపారు. వలసదారులకు రేషన్ పంపిణీ కోసం రాష్ట్రాలు తప్పనిసరిగా పథకాన్ని తీసుకురావాలని కోర్టు తెలిపింది. ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలు జూలై 31లోపు తప్పక అమలు చేయాలి అని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. బయోమెట్రిక్ విధానంలో రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు కోర్టుకు కేంద్రం విన్నవించింది. 32 రాష్ట్రాలకు చెందిన నేషనల్ ఫుడ్ సెక్యూర్టీ యాక్ట్ లోని 69 కోట్ల మంది లబ్ధిదారుల్ని వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు.