ఆగస్టు 15 వ్యాక్సిన్ ప్రకటన అత్యుత్సాహమేనా?
ఒక పక్క కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి ప్రపంచం, మనదేశం మొత్తం చిగురుటాకులా వణికి పోతుంటే.. మరొక పక్క దేెశంలోనే అత్యున్నత వైద్య పరిశోధన సంస్ద ఐసిఎమ్ఆర్ తన వ్యవహార శైలితో దేశ ప్రజల్లో అయోమయాన్ని మరింత పెంచేసింది. తొలుత ఆగస్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్ రెడీ అవుతుందని ప్రకటించేసిన ఐసిఎమ్ఆర్ ఆ తర్వాత స్వల్పవ్యవధిలోనే ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ తయారుచెయ్యాలని తాము ఆదేశించలేదని మరో లెటర్ ఎందుకు రాయాల్సివచ్చింది? అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న ఐసిఎమ్ ఆర్ మితి మీరిన రాజకీయ జోక్యం వల్ల కనీస ప్రాధమిక అంశాలను పక్కనపెట్టి ఎట్టి పరిస్తితుల్లోనూ ఆగస్ట్ 15 నాటికి కరొనా వ్యాక్సిన్ అందించాలని సదరు ప్రైవేట్ సంస్థలకు లెటర్ రాసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే సదరు ఆదేశాలు చూసి ఖంగుతిన్న సైంటిస్టులు.. డాక్టర్లు.. ఆ సంస్థ తీరుని తీవ్రంగా తప్పు పట్టడంతో పరువు పోయిందని గ్రహించిన ICMR తన తప్పు ను కప్పిపుచ్చుకొవడానికి తాము కేవలం పరిశొధన వేగవంతం చెయ్యమని మాత్రమే చెప్పామని ఆగస్టు 15ని తుదిగడువుగా నిర్ణయించలేదని లెటర్ రాసిందంటున్నారు.
ఆయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంతో పేరున్న సంస్థ అపప్రద మూటగట్టుకొవాల్సి వచ్చింది.. ఈ నేపధ్యంలో దీనిపై పార్మా రంగ నిపుణులు ఏమంటున్నారంటే… సుదీర్ఘ ప్రక్రియ వ్యాక్సిన్ తయారీ… ఏదైనా కొత్త వ్యాక్సిన్ తయారు చెయ్యాలంటే డబ్ల్యుహెచ్ఓ నిబంధనలను అనుసరించి క్లినికల్ ట్రయల్స్ 3 దశల్లో చెయ్యాల్సి ఉంటుంది. క్లినికల్ ట్రైల్ డేటాని పూర్తిగా అన్ని కోణాల్లో విశ్లేషించిన తరువాత మాత్రమే డ్రగ్ అప్రూవల్ చెసి.. సదరు వ్యాక్సిన్ కమర్షియల్ ప్రొడక్షన్ కు అనుమతి ఇస్తారు. ఈ మొత్తం క్లినికల్ ట్రయిల్ ప్రక్రియ 3 ఫేజ్ లలో జరుగుతుంది. మొదటి ఫేజ్ లో 120 మందికి వ్యాక్సిన్ ఇచ్చి 28 రోజుల పాటు పరీక్షిస్తారు.
రెండవ దశలో 1200 మందికీ వ్యాక్సిన్ ఇచ్చి కనీసం 5-6 నెలలు పరీక్షించాలి. ఇక చివరి మూడవ స్టేజ్ లో ఎక్కువ మంది సమూహాన్ని ఎంపిక చేసి వారికి ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఈ దశలో సెఫ్టీ సైడ్ ఎఫ్ఫెక్ట్ ని సమగ్రంగా పరీక్షిస్తారు. ఇలా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 15 నుండి 18 నెలలు పడుతుంది.. ఒక వేళ ఈవేవి సరిగ్గా పాటించకుండా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తే దాని సైడ్ ఎఫ్ఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అది వైరస్ కన్నా ప్రమాదం. ఇదంతా పక్కాగా జరిగిన తర్వాతే కమర్షియల్ ప్రొడక్షన్.. మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు..
కో-వ్యాక్సిన్ విషయంలో…
ఇక కరొనా వ్యాక్సిన్ (కో-వ్యాక్సిన్) విషయానికికొస్తే ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతియ ఫార్మా బయెటెక్ దిగ్గజ కంపెనీలతో పాటు పలు ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఇలా దాదాపు 140 కు పైగా సంస్థలు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ 140 లొ కుడా 3 వ దశ క్లినికల్ ట్రయల్స్ వరకు వచ్చింది కేవలం 3 కంపెనీలే. అవి ఆక్స్ ఫర్డు యూనివర్సిటీ సంయుక్త భాగస్వామ్యంతో బ్రిటన్ కు చెందిన దిగ్గజ కంపెనీ ‘ఆస్ట్రాజెనికా’.. అమెరికాకు చెందిన ‘మొడెన్నా’.. చైనా కు చెందిన ‘క్యాన్ సినో’.. మాత్రమే 3 వ దశ క్లినికల్ ట్రైల్ కు అనుమతి పొందాయి. అందులొ మన దేశానికి చెందిన కంపెనీలేవి లేవు. కాబట్టి వ్యాక్సిన్ అంటూ వస్తే అది మొదట ఈ 3 సంస్థల నుండే రావొచ్చు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 11 సంస్థలకు 2 దశ క్లినికల్ ట్రైల్స్ వరకు అనుమతి లభించగా అందులొ మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ (హైదారాబాద్) తో పాటు జైడస్ క్యాడిలా (అహ్మదాబాద్) ఉన్నాయి. ఇక వీటితోపాటు ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు ఫైజర్.. జాన్సన్&జాన్సన్.. నోవా వ్యాక్స్.. సినోవ్యాక్.. బయో ఎన్-టెక్.. ఇన్ వివో.. వంటి దిగ్గజ ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మరో 15 కంపెనీలు మొదట దశ క్లినికల్ ట్రయల్ వరకు అనుమతి పొందాయి.
ఇక హైదరాబాద్ లోని భారత్ బయెటెక్ కంపెనీ ఈ వారం మొదట దశ క్లినికల్ ట్రైల్ మొదలు పెట్టనున్నట్టు ప్రకటించింది. తాము మూడు దశల్లో క్లినికల్ ట్రైల్స్ పూర్తిచేసి మరో 15 నెలల్లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే.. పలానా కంపెనీ వ్యాక్సిన్ తయారుచేసిందని.. ఆగస్టు 15 నుండే పలానా కంపెనీ వ్యాక్సిన్ మార్కెట్లోకి రాబోతుందంటు జరుగుతున్న ప్రచారం కేవలం సదరు కంపెనీల ఆర్భాటపు మార్కెటింగ్ ప్రచారమేనని ఫార్మా రంగ నిపుణులు అంటున్నారు.
ఏదిఏమైనా అందరి ప్రయత్నాలు ఫలించి.. అందరికి అందుబాటు ధరల్లొ కొవిడ్ వ్యాక్సిన్ (కో-వ్యాక్సిన్) అతి త్వరలోనే మార్కెట్ లోకి రావాలనీ ఆశిద్దాం.













