తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి…
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి ప్రారంభం కానుంది. మూడు నెలలపాటు ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి నుండి మూడు నెలల వరకు శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. దీనికి తగినట్లుగా 2021 జనవరి 2వ వారం నుండి 4 నెలల పాటు మూహూర్తాలకు బ్రేక్ పడనుండడంతో ఈ సీజన్లోనే శుభకార్యాలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ నెల 29, 30, 31 తేదీలతోపాటు నవంబరు 4, 11 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత కార్తీక, మార్గశిర మాసాల్లోనూ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. 2021 జనవరి 2, 7 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండగా.. అదే నెలలో 16వ తేదీ నుండి మౌఢ్యమి కారణంగా నాలుగు నెలలపాటు వివాహ మూహూర్తాలు లేవని ప్రచారం సాగుతోంది. దీంతో కరోనా దెబ్బకు మూతపడిన ఫంక్షన్ హాళ్లు తెరుచుకోనున్నాయి. కొన్ని నెలలుగా మూతపడిన ఈ ఫంక్షన్ హాళ్లను వాటి నిర్వాహకులు తిరిగి పెళ్లిళ్లకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫంక్షన్ హాళ్లు, కల్యాణమండపాలను ముస్తాబు చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మార్చి నెల నుండి లాక్డౌన్ను కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ పెళ్లిళ్ల హడావుడీ లేకుండా పోయింది. తాజాగా ఇప్పుడు కరోనా వైరస్ తన ఉధృతిని తగ్గించడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో పెళ్లిళ్లు, ఫంక్షన్హాళ్లకు అనుమతి రావడంతో వైభవంగా వివాహ వేడుకలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. వీటితో పాటు పెళ్లిళ్లు లేక ఇంతవరకూ ఖాళీగా ఉన్న ఆర్కెస్ట్రా, బ్యాండ్, లైటింగ్, సౌండ్, పూలు, తదితర వాటి నిర్వాహకులు ఇప్పుడు వాటిని సిద్దం చేసుకుంటున్నారు.













