టికెట్ ఇచ్చిన తర్వాత లోక్‌సభ పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ అభ్యర్థులు!
లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార, విపక్ష పార్టీలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే తమ బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. కచ్చితంగా గెలుస్తారనుకున్న నేతలకే టికెట్ ఇచ్చి పోటీకి నిలబెడుతున్నారు. అయితే విచిత్రం ఏంటంటే.. అటు అధికార పక్షంతో పాటు విపక్షాలకు చెందిన కొంతమంది నేతలు తాము బరిలో దిగడం లేదని ప్రకటిస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా పార్టీ నుంచి టికెట్ లభించిన తర్వాత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ అందరికీ షాకిస్తున్నారు.
తాజాగా గుజరాత్‌లోని వడోదర సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్‌కు బీజేపీ మరోసారి టికెట్ ఇచ్చింది. అలాగే సబర్‌కాంతా నుంచి భికాజీ ఠాకూర్‌కు టికెట్ ప్రకటించింది. కానీ ఈ ఇద్దరు బీజేపీ అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి వైదొలిగుతున్నట్లు ప్రకటించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్లే తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని వారిద్దరూ వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టి తమ నిర్ణయాన్ని తెలిపారు.
భట్‌పై నియోజకవర్గంలో వ్యతిరేకత:
భట్‌కు మరోసారి టికెట్ ఇవ్వడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది. నియోజకవర్గంలో భట్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు కూడా వెలిశాయి. 2014లో నరేంద్ర మోదీ వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అయితే ఆ తర్వాత ఆయన వడోదర సీటును వదులుకుంటూ వారణాసి నుంచి కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఉప ఎన్నికలో భట్ విజయం సాధించారు. 2019లో కూడా అక్కడి ప్రజలు ఆమెకే మళ్లీ పట్టం కట్టారు. కానీ ఈ దఫా ఆమెపై నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కాగా.. గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో మే 7న పోలింగ్ జరగనుంది. గత రెండుసార్లు అన్ని సీట్లు కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది.
వరుసగా వైదొలుగుతున్న నేతలు:
కొద్దిరోజుల క్రితం మరో ఇద్దరు నేతలు కూడా ఈ తరహా ప్రకటనలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ నియోజకవర్గం నుంచి ఉపేంద్ర సింగ్ రావత్‌ను ఎంపిక చేసిన కొన్ని గంటల్లోనే.. ఆయనకు చెందిన అశ్లీల వీడియో వైరల్ కావడం, అది వివాదాస్పదం కావడంతో పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అంతకుముందు పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ లోక్‌సభ స్థానానికి గానూ బెంగాలీ నటుడు పవన్‌సింగ్ బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. కానీ ఆయన పాటలు మహిళల్ని అసభ్యకరంగా చిత్రీకరించేలా ఉంటున్నాయనే విమర్శలు రావడంతో ఆయన కూడా పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రస్తుతం పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.













