దేశద్రోహం చట్టంపై సుప్రీంకు కేంద్రం వివరణ
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దేశద్రోహం చట్టంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఐపీసీలోని సెక్షన్ 124 (ఎ) దేశద్రోహం చట్టంలో మార్పులు చేయబోతున్నట్లు సోమవారం నాడు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దేశద్రోహం చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే కొన్ని పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. దీనిపై కేంద్రం వివరణనిస్తూ చట్టంలో త్వరలోనే కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ పిటిషన్లపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి రెండో వారానికి వాయిదా వేస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రకటించారు.













