17న అఖిలపక్షం భేటీ!
ఈ నెలలో ఐదురోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించడం దేశ రాజకీయాల్లో ఇటీవల చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఎజెండా ఏంటనే విషయాన్ని వెల్లడించకపోయినప్పటికీ అందులో ముఖ్యమైన అంశాలున్నాయని చెప్పడంతో వీటిపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి మొదలుకానున్నాయి. అంతకుముందు రోజు 17న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ఆహ్వానం ఆ పార్టీ నేతలకు ఈ మెయిల్ ద్వారా పంపించాం అని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.













