మమతకు ఝలక్.. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన గవర్నర్
బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చొన్న మమతా బెనర్జీకి గవర్నర్ ఆర్.ఎన్. రవి ఝలక్ ఇచ్చారు. టీఎంసీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేశారు. అలాగే బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసేశారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తన విచక్షణా అధికారాలను వినియోగించి, ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి 6 వ తేదీతో అసెంబ్లీ ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. అయినా మమతా బెనర్జీ తన రాజీనామాను గవర్నర్ కి సమర్పించలేదు. ఈ నేపథ్యంలో గవర్నరే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయి, బీజేపీ ఘన విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
అయితే.. బీజేపీ గెలుపును దొంగలించిందని, వారి గెలుపు అనైతికమని మమతా ఆరోపించింది. ఈసీ, కేంద్ర బలగాల సాయంతో బీజేపీ గెలిచిందని విమర్శించింది. అందుకే తాను రాజీనామా చేయనని వింత పోకడను అవలంబించింది.
మమతా బెనర్జీ ఎంతకూ వినకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి మనోజ్ కుమార్ గవర్నర్ ఆర్.ఎన్. రవితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల గెజిట్ నోటిఫికేషన్ ను సమర్పించారు. దీంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఆహ్వానించే ప్రక్రియకు మార్గం సుగుమమైంది.
నిజానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం ఐదేళ్ల పదవీ కాలం ముగియడంతో మే 6 వ తేదీ అర్ధరాత్రి నుంచే బెంగాల్ అసెంబ్లీ రద్దవుతుంది. రాజ్యాంగం ప్రకారం ఇదే నిబంధన. కానీ.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుత మంత్రివర్గం తాత్కాలిక ప్రభుత్వంగా కొనసాగవచ్చు.








