బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, పటేల్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ జూన్ 2వ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకోనున్నారు. గుజరాత్ బీజేపీ అధినేత సీఆర్ పాటిల్ హార్దిక్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి యగ్నేష్ దావె తెలిపారు. అంతర్గత కుమ్ములాటలే కానీ ప్రజా సమస్యలపై పార్టీ దృష్టి పెట్టదంటూ తీవ్ర విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీని వీడిన హార్దిక్ తొందరలోనే బీజేపీలో చేరతారని ముందు నుంచే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూనే తాజాగా బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
హార్దిక్ పటేల్ ఈ నెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్ 2020, జూలై 11న గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం, నాయకత్వం తీరుపై విసుగు చెందిన రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.













