ప్రసంగాల్లో దివ్యాంగులను అవమానించే పదాలు వాడకూడదు.. ఎన్నికల సంఘం షరతు
కొందరు రాజకీయ నాయకులు ఇటీవల ఆమోదయోగ్యంకాని పదాలను కూడా తమ ప్రసంగాల్లో వాడేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పలు వర్గాల నుంచి తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన సూచనలు చేసింది. రాజకీయ నాయకులు, ప్రతినిధులు ఇకపై బహిరంగ ప్రకటన లేదా ప్రసంగాల్లో దివ్యాంగుల వైకల్యాన్ని ప్రతిబింబించే పదాలను వాడకూడదని స్పష్టం చేసింది. మూగ, పాగల్, అంధా, గుడ్డి, చెవిటి, కుంటి వంటి పదాలను నేతలు ఉపయోగించ వద్దని తేల్చిచెప్పింది. ఇలాంటి పదాలు వాడటం చాలా అవమానకరమని, దీని నివారణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఈసీ కోరింది. నాయకుల ఉపన్యాసాలు, ప్రకటనలు, సోషల్ మీడియా పోస్ట్లు సహా అన్ని ప్రచారాల్లో దివ్యాంగుల పట్ల వివక్షను ప్రతిబింబించే పదాలు వాడకూడదని పార్టీలకు సూచించింది. దీని కోసం ఆయా పార్టీలు అంతర్గతంగా సమీక్షించుకోవాలని తెలిపింది. ప్రసంగాల్లో ఇలాంటి పదాలను నిషేధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.













