విదేశీ విధానంపై భారత్ మరోసారి స్పష్టత
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో తమ విదేశీ విధానంపై భారత్ మరోసారి స్పష్టత ఇచ్చింది. తాము ఎంచుకున్న మార్గానికి ఏ దేశ ఆమోదం అవసరం లేదని నొక్కి చెప్పింది. అంతేకాకుండా ఇతర దేశాల ఒత్తిడిని అనుకరిస్తూ ప్రపంచ దేశాలను సంతోష పెట్టలేమని తేల్చి చెప్పింది. పాశ్చాత్య దేశాలు చేస్తోన్న విమర్శల నేపథ్యంలో భారత్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా పేర్కొంది. మనం ఎవరు అన్న విషయంలో దృఢ విశ్వాసంతో ఉండాలి. ఇతరులను అనుకరిస్తూ ప్రపంచాన్ని సంతోషపెట్టడం కంటే మనం ఎవరనే విషయంపై ప్రపంచ దేశాలు నిమగ్నమవడం మంచిదని భావిస్తున్నాను అని రైసినా అంతర్జాతీయ సదస్సులో విదేశాంగ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఇతరుల ఆమోదం పొందాలనే మునుపటి ఆలోచన నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని అన్నారు.













