ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆప్ కు
ఢిల్లీ మేయర్ ఎన్నిక వరుసగా వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు ఈ ఎన్నిక ప్రక్రియకు ఆటంకం కలగగా మరోసారి వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంకోర్టును ఆశ్రయించగా దీనిపై విచారణ జరిపేందుకు కోర్టు అంగీకరించింది. దాంతో గురువారం జరగాల్సిన ఎన్నిక మరోసారి వాయిదాపడినట్లైంది. ఈ కేసును విచారణకు స్వీకరిస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్య చేసింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదని చట్టంలో స్పష్టంగా ఉంది అని పేర్కొంది. గత డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో ఆప్ విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్ ( 126) దాటి 134 స్థానాలకు కైవసం చేసుకుంది. మొజారిటీ ప్రకారం మేయర్ పదవి ఆప్కే దక్కే అవకాశాలు ఉంటాయి. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినెటేడ్ కౌన్సిలర్స్ చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి కారణమయ్యింది. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి అనుమతి లేదంటూ ఆప్ వ్యతిరేకిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.













