దేశంలో ఇదే అతి పెద్ద విధ్వంసం
స్వాతంత్య్రానంతరం దేశంలో ఇదే అతి పెద్ద విధ్వంసమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని అన్నారు. ఢిల్లీ లో కాషాయ పార్టీ బుల్డోజర్లు ఇదే తరహాలో తిరిగితే నగరంలో 63 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ లో ఆక్రమణలను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కూల్చివేస్తోందని అన్నారు. ఈ ప్రక్రియలో కీలక అంశాలను గుర్తుంచుకోవాలని చెబుతూ ఢిల్లీ లో ప్రజలు తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను చూసినా కూల్చివేతలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ లోని మురికివాడలు, గుడిసెలను నేలమట్టం చేస్తున్నారని దుయ్యబట్టారు.













