చైనా విషయంలో ప్రధాని, హోం మంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
బీజేపీ హయాంలో చైనా ఒక్క అంగుళం భారత భూభాగాన్ని కూడా ఆక్రమించుకోలేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తీవ్రంగా ఖండించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చెబుతున్నవన్నీ అబద్ధాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు బీజేపీ క్లీన్ చిట్ ఇచ్చిన ప్రతిసారీ డ్రాగన్ ఆక్రమణలను అడ్డుకోవడం భారత్‌కు మరింత కష్టతరం అవుతోందని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. “2020 జూన్ 19న చైనాపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో, ఒక్క చైనా సైనికుడు కూడా భారత భూభాగంలోకి ప్రవేశించలేదని ప్రధాన మంత్రి ప్రకటించారు. ప్రధానమంత్రి చెప్పిన అబద్ధం చైనీయులకు ఉపయోగపడింది. ప్రధాని మాటలనే ఉదాహరణగా చూపిస్తూ తాము భారత భూభాగంలోకి చొరబడలేదని ఉటంకించింది చైనా. ఇప్పటికీ ప్రధానమంత్రి ఇంకా అబద్ధాలు, వాస్తవాలను తారుమారు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటి లేరు. ఇక ఇప్పుడు మరోసారి హోం మంత్రి షా.. చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారు.’’ అన్నారు.
అనంతరం ప్రధాని, హోం మంత్రి చెబుతున్నవి అబద్ధాలంటూ కొన్ని వివరణలు కూడా జైరాం రమేశ్ ఇచ్చారు. చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని, లడఖ్‌లోని 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26 పాయింట్లని చైనా స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో 50-60 కి.మీ భూభాగాన్ని ఆక్రమించిన చైనా.. పూర్తి గ్రామాలను నిర్మించిందని, ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ వాస్తవాలు ధృవీకరించారని లోక్‌సభ సాక్షిగా బీజేపీ ఎంపీ తపిర్ గావో స్వయంగా పేర్కొన్నారని జైరాం రమేశ్ వివరించారు.













