పీఎఫ్ఐపై ఐదేళ్ల నిషేధం.. కేంద్రం కీలక నిర్ణయం
విదేశాల నుంచి నిధులు సేకరించి, భారత్ లో ఉగ్ర దాడులకు పథకాలు వేస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై (పీఎఫ్ఐ) కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఐదేళ్ళపాటు ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. పీఎఫ్ఐతోపాటు దాని అనుబంధ సంస్థలను కూడా బ్యాన్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం పేర్కొంది.
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పీఎఫ్ఐ సహకరిస్తుందని ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు దీనిపై వరుసగా దాడులు చేశాయి. ఈనెల 22, 27 తేదీల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 3 వందల మందికిపైగా పీఎఫ్ఐ సభ్యులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ సోదాల్లో పీఎఫ్ఐకి వ్యతిరేకంగా లభించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. దసరా సమయంలో ఓ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులను హతమార్చేందుకు, వివిధ రాష్ట్రాల్లో అలజడులు సృష్టించేందుకు పీఎఫ్ఐ కుట్రపన్నిందని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో పీఎఫ్ఐపై నిషేధం విధించాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి. దీంతో పీఎఫ్ఐతోపాటు దాని అనుబంధ సంస్థలైన రిహాబ్ ఇండి ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్ కేరళపై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.













