పీవీ సింధును సత్కరించిన కేంద్ర మంత్రులు
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో క్రీడాల్లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీ.వీ సింధుకు రాజధాని ఢిల్లీలో అపూర్వ గౌరవం దక్కింది. ఢిల్లీకి చేరుకున్న సింధుకు విమానాశ్రయంలో బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఢిల్లీలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, నిశిత్ ప్రమాణిక్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొని తెలుగుతేజాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సింధు ప్రతిభను వారు కొనియాడారు. ఒలింపిక్స్ క్రీడల్లో రెండు పతకాలు సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసిందని ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. సింధు విజయం కోట్లాది మంది క్రీడాకారులకు స్ఫూర్తిని ఇస్తుందని వారు పేర్కొన్నారు.













