గుజరాత్ అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్
గుజరాత్ శాసన సభ తొలి మహిళ స్పీకర్గా నిమాబెన్ ఆచార్య ఎన్నిక కాబోతున్నారు. బీజేపీ అభ్యర్థిని అయిన నిమోబెన్కు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతివ్వడంతో ఆమె ఎన్నిక ఇక లాంఛనమేనని తెలుస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే శాసన సభ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. రాజేంద్ర త్రివేది ఈ నెల 16న అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ పదవికి ఎన్నిక అవసరమైంది. స్పీకర్ పదవికి అభ్యర్థిగా నిమా బెన్ ఆచార్యను బీజేపీ ఎంపిక చేసింది. ఆమె అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు నామినేషన్లను అసెంబ్లీ సెక్రటేరియట్ ఆహ్వానించింది. నిమాబెన్ ఆచార్య నామినేషన్ పత్రాలను త్రివేది, బీజేపీ చీఫ్ విప్ పంకజ్ దేశాయ్ కలిసి సమర్పించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి జెఠా భర్వాడ్ తరపున నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటేరియట్ ఆమోదించింది.













