1947 నుంచి అమెరికా కట్టుబడి ఉంది : జో బైడెన్
స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లేఖలు రాశారు. అమెరికాలో భారత రాయబారి తరుణ్‌జిత్ సింగ్ సంధూకు విదేశీ వ్యవహారాల ప్రతినిధి మెక్‌కియాన్ వీటిని స్వయంగా అందజేశారు. కొవిడ్‌పై పోరు, వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడం, ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థల్ని మెరుగుపరిచే విషయంలో భారత్‌తో కలిసి పనిచేయాలని బైడెన్ భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మరింత స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన, సుసంపన్నమైన ప్రపంచం కోసం ఉమ్మడిగా పని చేయాలని మునుపటి భేటీలో బైడెన్ మోదీ చర్చించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్యాలను, స్వేచ్ఛను పరిరక్షించుకోవడం రెండు దేశాల్లో అన్ని తరాల వారికి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు 1947 నుంచి అమెరికా కట్టుబడి ఉందన్నారు. ఇరు దేశాల స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందంటూ భారత మొట్టమొదటి ప్రధాని నెహ్రూకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ రాసిన లేఖను ఈ సందర్భంగా ప్రస్తావించారు.













