ఈడీ మా నలుగురిని కూడా అరెస్ట్ చేస్తుంది: ఆప్ మంత్రి అతిశీ
ఎన్నికలు మొదలయ్యే లోపే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో నలుగులు నేతలు అరెస్టవుతారని ఢిల్లీ మంత్రి ఆతిశీ మర్లీనా అన్నారు. ఆ లిస్ట్‌లో తాను కూడా ఉన్నానని, తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దా త్వరలో అరెస్ట్ కాబోతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అతిశీ.. సోమవారం కోర్టు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సౌరభ్ భరద్వాజ్‌తో పాటు తన పేరు ప్రస్తావించిందని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.
‘‘నిన్న కోర్టులో ఈడీ.. నా పేరు, సౌరభ్ పేరు ప్రస్తావించింది. సీబీఐ, ఈడీ వద్ద ఈ స్టేట్మెంట్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దానిని ఇప్పుడు బయటపెట్టింది. ఎందుకంటే.. కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ అరెస్టయిన తర్వాత కూడా మా పార్టీ ఒక్కటిగా ఉండడం బీజేపీ సహించలేకపోతోంది. దాంతో వారి తర్వాత వరుసలో ఉన్న నేతలను జైలులో పెట్టేందుకే ఈ కుట్ర పన్నుతోంది’’ అంటూ అతిశీ ఆరోపించారు. అలాగే తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి తమలో చేరాలంటూ తనను ఒక వ్యక్తి ద్వారా బీజేపీ సంప్రదించిందని, అందుకు అంగీకరించకపోతే ఈడీ తనను కూడా అరెస్టు చేస్తుందని బెదిరించిందని షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణలో విజయ్ నాయర్‌కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. విజయ్ నాయర్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని, అతడు తన మంత్రి వర్గంలోని ఆతిశీ, సౌరభ్‌కు మాత్రమే రిపోర్టు చేసేవాడని సీఎం పేర్కొన్నట్లు ఏఎస్జీ ఎస్వీ రాజు కోర్టుకు వెల్లడించారు. ఈ పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో అతిశీ తాజాగా చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.













