రాజకీయ పార్టీలకు, గ్రూప్‌లకు అనుబంధం కాకుండా పత్రికలను, న్యూస్ చానెళ్లను నడప లేమా?
నేను ఈనాడులో 1984లో చేరాను కాబట్టి దాదాపు 4 దశాబ్దాల మీడియా అనుభవం వున్న జర్నలిస్ట్‌ని అని చెప్పవచ్చు. అలాగే 2003లో అమెరికాలో తెలుగు వారి కోసం తెలుగు టైమ్స్ పత్రిక ప్రారంభించాము కాబట్టి ఒక 20 ఎళ్ల మీడియా ఎంట్రెప్రేనేర్ అనుభవం కూడా వచ్చింది అని అనుకోవచ్చు. చాల రోజులుగా నా మదిని తొలిచేస్తున్న పాయింట్ అనే కంటే… నన్ను వెంటాడుతున్న… వేటాడుతున్న సమస్య అనడం మంచిది. ఎందుకంటే.. కేవలం ఇది విశ్లేషణ కోసం కాదు… ఒక పత్రిక నడపడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం అని కూడా చెప్పవచ్చు
ప్రస్తుత పరిస్థితిని తెలుగు టైమ్స్ కోణంలో… సాధారణ కోణంలో… విశ్లేషణ చేద్దాం.
తెలుగు టైమ్స్ ప్రారంభించినప్పుడే (2003- 04) సమయంలో ‘‘తెలుగు వారి పత్రిక ఇది. అందరి కోసం… అందరికీ కావలసిన విశేషాలు, వివరాలు ఇవ్వాలి’’ అన్న ఎడిటోరియల్ ఫిలాసఫీతో మొదలు పెట్టాం. 2004లో ఆంధ్ర రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగడం టీడీపీ ప్రభుత్వం వెళ్లి పోయి, ణతీ వైస్సార్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అప్పటికే అమెరికాలో ఉన్న రెండు జాతీయ తెలుగు సంఘాలు పూర్తిగా కాకపోయినా.. ఓపెన్‌గా కాకపోయినా…. తానా – తెలుగు దేశం పార్టీ తోనూ, ఆటా – కాంగ్రెస్ పార్టీతోనూ స్నేహం గా, సౌఖ్యంగా వుంటాయని అందరూ అనుకోవడం తప్పు కాదు. పత్రికలో తానా – ఆటా వార్తలు, టీడీపీ – కాంగ్రెస్ వార్తలు బాలన్స్ చేసుకొంటూ వచ్చాం. తెలుగు కమ్యూనిటీలో అందరికి తెలిసిన తానా – టీడీపీ నాయకులు జయరాం కోమటి తెలుగు టైమ్స్‌కి చైర్మన్‌గా (2003 నుంచి – 2020 వరకు) ఉన్నా కూడా ఎప్పుడూ ‘ఈ ఐటెం వెయ్యమని లేదా ఈ ఐటెం వెయ్య వద్దు’ అని చెప్పలేదు. ఆయనకు ధన్య వాదాలు. అలాగే తెలుగు టైమ్స్‌ని ఒక పత్రికగా గౌరవంగా చూసిన తానా, ఆటా నాయకత్వాలు కూడా ధన్యవాదాలు. అనుకో కుండా 2007 మే నెలలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి ణతీ ్‌ూ రాజశేఖర్ రెడ్డి అమెరికా టూర్లో నేను ఆఫిషియల్ మీడియా కోఆర్డినేటర్‌గా రావడం, ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలుగు టైమ్స్ – ఈస్ట్ కోస్ట్ ఎడిషన్ ప్రారంభించటం, సరిగ్గా నెల తరువాత అప్పటి ప్రతి పక్ష నాయకులు చంద్రబాబు నాయుడు 10 పట్టణాల అమెరికా టూర్‌కి కూడా నేనే ఆఫిషియల్ మీడియా కోఆర్డినేటర్‌గా రావడం, చంద్రబాబు ఇంటర్వ్యూతో ఒక ప్రత్యేక సంచిక, వారి టూర్ విశేషాలతో ఇంకో రెండు సంచికలు రావడంతో తెలుగు టైమ్స్ కూడా బాగా పాపులర్ అయింది.
ఈ క్రమంలో కమ్యూనిటీతో సన్నిహిత పరిచయాలు ఏర్పడటంతో ఆయా సంఘాల లేదా రాజకీయ పార్టీల ప్రగాఢ అభిమానులు. ‘‘మా ఐటెం సరిగ్గా వెయ్య లేదు.. లేదా వాళ్ళ ఐటెంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు’’ లాంటి మాటలు సరదాగా అనే స్థాయి నుంచి, గట్టిగా ఫిర్యాదు చేసే స్థాయికి రావడం, వాటిని సున్నితంగా మానేజ్ చేసుకొంటూ రావడం అలవాటై పోయింది. 2010 తరువాత తానా (ుAచీA) నుంచి నాట్స్ (చీAుూ), ఆటా (AుA) నుంచి నాటా (చీAుA) ఆ తరువాతా టాటా (ుAుA) రావడం. 2014లో రాష్ట్ర విభజన జరిగి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడటం, అమెరికాలో అన్ని చోట్ల తెలంగాణ సంఘాలు రావడం జరిగి, తెలుగు టైమ్స్ వార్తలు ప్రచురించటంలో కంటే.. అందరిని సంతృప్తి పరచడంలో ఎక్కువ కష్టపడుతున్నాము అని చెప్పొచ్చు. ఇన్ని సంఘాలు వచ్చాక ‘అన్నింటిని చూసుకొనే పత్రిక ఇది’ అనుకొనే మిత్రుల కంటే ‘‘ మా ఐటెంలు వేయండి… వాళ్ళ ఐటెంలు వెయ్యకండి ‘‘అనే మిత్రులే ఎక్కువ అవుతున్నారు.
ఇంకా లోతుగా చూస్తే… తానా లాంటి పెద్ద తెలుగు సంస్థలో ఎన్నికలు, అంతర్గత పోరాటాలు జరగడం… అప్పుడు ఏ వర్గానికి చెందకుండా ఒక పత్రికగా నిలబడాలని తెలుగు టైమ్స్ ప్రయత్నించడం కత్తి మీద సాము చేసినట్టే అయింది (అవుతోంది). ఇరు వర్గాలలో స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు.. రెండు వర్గాల వారు అసంతృప్తితో ఉండటం, రెండో వర్గం వారి న్యూస్ వెయ్యొద్దు అని అడగటం బాగా ఎక్కువ అయిపొయింది. అన్నింటికీ మించి ‘రెండో వర్గంని తప్పు పడుతూ.. మా వర్గంని సపోర్ట్ చేస్తూ కధనాలు రాయాలి’ అని అడిగే వాళ్ళు, పోట్లాడే వాళ్ళు రాను రాను ఎక్కువ అయిపోవటం బాధాకరం. ఒక పత్రిక తటస్తంగా ఉండ కూడదా? ఉండ లేదా?
తెలుగు రాష్ట్రాల పత్రికలను, టీవీ ఛానెళ్లను చూస్తే.. రాజకీయ పార్టీలకు అనుబంధంగా చాలా దూరం వెళ్లిపోయాయి అని అందరికి తెలుసు. మీడియా పెద్దలతో మాట్లాడితే.. ఇది ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సమస్య కాదు.. అన్ని రాష్ట్రాలలో, దేశాలలో కూడా వుంది. అమెరికాలో కూడా ఖీశీఞ చీవషం రిపబ్లికన్ పార్టీ / ప్రభుత్వంని, జచీచీ డెమొక్రాట్ పార్టీ /ప్రభుత్వంకి మద్దతుగా తామ వార్తా కధనాలు వుంటాయని అందరికి తెలిసిన విషయమే కదా అని సమర్ధించే వారు చాలామంది ఉన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లో ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలు, టివీ 5 టీడీపీకి మద్దతుగా, సాక్షి పత్రిక, సాక్షి టీవీలు ప్రభుత్వానికి / వైఎస్ఆర్ పార్టీ కి మద్దతుగా ఉందని సంగతి అందరికి తెలిసిందే. ‘‘అయితే ఒక దిన పత్రిక ప్రభుత్వానికి మద్దతుగా లేదా వ్యతిరేకంగా ఉండటం ఎన్నో దశాబ్దాల నుంచి వుంది. ఆంధ్రప్రభ / ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండటం ఎప్పటి నుంచో వుంది. ఆ రోజుల్లో ఆ పత్రికలు అన్ని వార్తలు ఇచ్చేవారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కొంచెం ఎక్కువగా, కొంచెం ప్రధానంగా ఇచ్చే వారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కేవలం ఒక వైపు వార్తలే ఉంటున్నాయి. సామాన్య పౌరుడికి / పాఠకుడికి ఒక సంఘటన గురించి తెలియాలంటే 2-3 దిన పత్రికలు చదివి, అన్ని వార్తలను విశ్లేషణ చేసుకొని పూర్తి వార్త తెలుసు కోవాలి … అప్పుడు కూడా పూర్తి వార్త తెలిసింది అన్న నమ్మకం లేదు’’ అని అనేక మంది (ఏ పార్టీకి చెందని వాళ్ళు) బాధ పడటం మనం రోజూ చూస్తున్నాం.
‘‘అన్ని పార్టీలకు, కులాలకు ప్రగాడాభిమానులు ఎప్పుడూ వుంటారు. తప్పు లేదు. కానీ ఇప్పుడు వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ అభిమానులు సోషల్ మీడియాను వేదిక చేసుకొని తమ వారిపై అభిమానం, ఎదుటి వారిపై కోపం ప్రదర్సిస్తూ వుంటారు. ఒక ఫెస్బుక్లోనో, ఒక వాట్స్ అప్ చాట్లోనో చేసే వారి దురుసు చర్యలను ఎవరు ఆప గలరు?’’ అని ఒక సీనియర్ ఎన్నారై చేసిన కామెంట్ కూడా ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారడం అమెరికాలోని అనేకమందికి తెలుసు.
ఈ ప్రగాడాభిమానులు ఎన్నారై టీడీపీలో, ఎన్నారై వైసీపీలో వున్నారు. ఇరు వర్గాలతో స్నేహ పూరితం గా ఉంటూ, వారి వారి అభిప్రాయాలను, కార్య క్రమాలను గౌరవిస్తూ తెలుగు టైమ్స్ ముందుకు వెళుతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు అరెస్ట్ సంబంధించి అన్ని వార్తలను తెలుగు టైమ్స్ వెబ్ ఎడిషన్‌లో ప్రతి రోజూ ప్రచురిస్తూనే వుంది. 1 సెప్టెంబర్ సంచికలో కవర్ స్టోరీలా కూడా ఇవ్వటం జరిగింది.
అయితే తెలుగు టైమ్స్ ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో జరిగే / జరిపే అభివృద్ధికి చెందిన ప్రభుత్వ కార్యక్రమాలు ఇస్తూ ఉంటుంది. అమెరికాలో వున్న తెలుగు కమ్యూనిటీకి తెలుగు రాష్ట్రాలలో జరిగే అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో పరిస్థితులు, సినిమా విశేషాలు ఇస్తూ ఉంటుంది. కమ్యూనిటీకి కావాల్సిన వార్తలు ఇవే.. రాజకీయ పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవటం రెండు రాష్ట్రాలలో రోజూ జరిగే పనే! తెలుగు టైమ్స్ ఆ పరస్పర దూషణలకు ఎప్పుడూ దూరమే! అలాగే క్రిందటి సంవత్సరం జరిగిన ఆటా కాన్ఫరెన్స్‌కి, ఈ సంవత్సరం జరిగిన నాట్స్, నాటా, తానా కాన్ఫరెన్స్ లకు తెలుగు టైమ్స్ మీడియా పార్టనర్‌గా వుంది. అన్ని సభలకు తెలుగు టైమ్స్ ప్రత్యేక సంచికలు తీసుకు వచ్చింది. అందరి మన్ననలు పొందింది.
వార్తలను వార్తలుగా చూపే పత్రికలూ లేని ఈ రోజుల్లో తెలుగు టైమ్స్‌ని అభిమానించే పాఠకులు కూడా అమెరికా అంతటా వున్నారు. వారికి నిక్స్పక్షంగా వార్తలు అందించే బాధ్యత తెలుగు టైమ్స్‌కి ఉందని, అందరూ సహకరించాలని కోరుకొంటున్నాము.













