శివసేనకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్
మిత్రమైన శివసేనకు కాంగ్రెస్ హఠాత్తుగా ఝలక్ ఇచ్చింది. శివసేన ఇంకా యూపీఏలో భాగస్వామి కాదని తెగేసి చెప్పింది. శివసేనతో పొత్తు కేవలం మహారాష్ట్ర కే పరిమితమని మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ తేల్చి చెప్పారు. ఈ తాజా వ్యాఖ్యలతో ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చెలరేగింది. అసెంబ్లీ ఫలితాల తర్వాత బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ‘మహావికాస్ అగాఢీ’ పేరుతో సంకీర్ణ కూటమిగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో అశోక్ చవాన్ మాటలు ఆసక్తి రేపుతున్నాయి. ‘‘శివసేన యూపీఏలో ఇంకా భాగస్వామ్యం కాలేదు. శివసేనతో పొత్తు కేవలం మహారాష్ట్రకు మాత్రమే పరిమితం. కనీస ఉమ్మడి కార్యక్రమం (కామన్ మినిమం ప్రోగ్రాం) మహారాష్ట్రకే పరిమితం. యూపీఏ నాయకత్వం విషయంలో శివసేన వ్యాఖ్యానించడం సరైన విధానమే కాదు.’’ అని అశోక్ చవాన్ తేల్చి చెప్పారు. యూపీఏ చైర్మన్ పదవి విషయంలో తనకు ఆసక్తే లేదని శరద్ పవారే స్వయంగా వెల్లడించాలని చవాన్ పేర్కొన్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలందరూ సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసం ఉంచారని, ఈ విషయంపై చర్చ అవసరం లేదని చవాన్ తేల్చి చెప్పారు.
ఇంతకీ శివసేన నేత సంజయ్ రౌత్ ఏమన్నారంటే…
దేశంలో మోదీ నియంతృత్వ విధానాన్ని అవలంబిస్తున్నారని అందుకే యూపీఏను విస్తరించాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ‘‘విపక్షాలన్నీ ఒకే గొడుకు కిందికి రావాల్సిన అసవరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంబిస్తోంది. విపక్షాలు బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యానికే ముప్పు’’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
శివసేన, కాంగ్రెస్ మధ్య సైద్ధాంతిక వైరుధ్యం ముందు నుంచీ ఉంది. బీజేపీతో శివసేన కటీఫ్ చెప్పేసిన తర్వాత… ఎన్సీపీ శివసేనకు స్నేహ హస్తం చాటింది. కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ శివసేనతో పొత్తుకు ఊగిసలాటలో పడింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎంత తొందరగా శివసేనకు స్నేహ హస్తాన్ని చాటారో… కాంగ్రెస్ అంత తొందరగా స్నేహ హస్తం చాటలేకపోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శివసేనతో పొత్తు పెట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని అప్పట్లో వార్తలొచ్చాయి. శివసేన బీసీ+ హిందుత్వ+ మరాఠా ఈ మూడు అంశాలను కలిపి రాజకీయాలు చేస్తుంది. ఇక… ఎన్సీపీ… మరాఠా+ కులంతో ముందుకెళ్తుంది. కాబట్టి శివసేనతో పొత్తు పెట్టుకున్నా… దాని ఓట్ బ్యాంకు చెదిరిపోదు. కానీ.. కాంగ్రెస్‌కు అలా కాదు. కాంగ్రెస్‌కు మహారాష్ట్రలో మూలాలు అంత బలంగా లేవు. దీంతో హిందుత్వ కార్డును తలకెత్తుకున్న శివసేనతో పొత్తు పెట్టుకోడానికి సోనియా గాంధీ అయిష్టత చూపారు. శివసేన పొత్తుతో తమ లౌకికమైన బ్రాండ్, లౌకిక ఓటుబ్యాంకు చెల్లాచెదురు అయిపోతుందని కాంగ్రెస్ వర్గాలు తీవ్ర ఆందోళన చెందాయి. అయితే… చివరికి… ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ఒత్తిడి, నెరిపిన రాజకీయం కారణంగా కాంగ్రెస్ మహావికాస్ అగాఢీలో చేరిపోయారు. అప్పటి నుంచి… శివసేనతో కాంగ్రెస్ అంటీముట్టనట్టుగానే ఉంటోంది. బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ పథకాలను తొందరగా అమలు చేయాలంటూ తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏకంగా సీఎం ఉద్ధవ్‌కు లేఖ రాశారు. దీనిపై శివసేన కూడా ఘాటుగానే స్పందించింది. ‘‘మాది సంకీర్ణ ప్రభుత్వం. కాంగ్రెస్ మాతో కలిసి పనిచేస్తోంది. మాది మిత్రపక్షం. ఎలాంటి ఒత్తిళ్లూ పనిచేయవు.’’ అని సంజయ్ రౌత్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ… శివసేనను యూపీఏలోకి తీసుకుంటే మతం ముద్ర కాంగ్రెస్ పై పడే ప్రమాదం ఉందని, అందుకే శివసేనతో పొత్తును కాంగ్రెస్ మహారాష్ట్రకే పరిమితం చేస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.













