నా కుమారుడిని ఓడించండి.. కాంగ్రెస్ను గెలిపించండి: ఏకే ఆంటోనీ
కేరళలోని పతనంతిట్ట లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ కే ఆంటోనీ ఎన్నికల్లో గెలవకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత తన మౌనాన్ని వీడి, తన కుమారుడిని ఓడించాలని, అతడి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోనిని పూర్తి మెజారిటీతో గెలిపించాలని ఏకే ఆంటోనీ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఏకే ఆంటోనీ.. కాంగ్రెస్ ప్రచారాలకు దూరంగా ఉండడానికి, తిరువనంతపురం నుంచి బయటకు రాకపోవడానికి తన ఆరోగ్య సమస్యలే కారణమని చెప్పారు. అయితే ఈ దఫా దేశంలో జరుగుతున్నవి భారతదేశాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడటానికి జరుగుతున్న ఎన్నికలని, అందుకే తాను బయటకు వచ్చి తన వైఖరిని స్పష్టం చేస్తున్నానని వివరించారు. తనకు తన కుటుంబం కంటే దేశమే ముఖ్యమని చెప్పిన ఏకే ఆంటోనీ..
“నా దృష్టిలో కుటుంబం, రాజకీయాలు విభిన్నమైనవి. ఇదేమీ నేను కొత్తగా అనుసరిస్తున్న వైఖరి కాదు. నేను కేఎస్యూ (కేరళ స్టూడెంట్స్ యూనియన్)లో ఉన్న రోజుల నుండి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాను” అని ఆంటోనీ పేర్కొన్నారు. 83 ఏళ్ల ఏకే ఆంటోనీ సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ తరపున కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే కేరళకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఇదిలా ఉంటే తండ్రి వ్యాఖ్యలపై అనిల్ ఆంటోని స్పందించారు. ఏకే ఆంటోనిని చూస్తే తనకు జాలేస్తోందన్నారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న గాంధీ కుటుంబం కోసం ఆయన మాట్లాడుతున్నారన్నారు. జూన్ 4న ప్రధాని మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. మోదీ నేతృత్వంలోని భాజపా మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లి లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కాలం చెల్లిన నాయకులతో నిండిపోయిందని విమర్శించారు. ఏప్రిల్ 26న జరగనున్న రెండో విడత పోలింగ్లో పతనంతిట్ట లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.













